రాజులు మొదటి గ్రంథము (1 Kings)
Chapter 1
1. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను.
2. కాబట్టి వారుమా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి
3. ఇశ్రా యేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి.
4. ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయు చుండెను గాని రాజు దానిని కూడలేదు.
5. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడైనేనే రాజు నగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.
6. అతని తండ్రినీవు ఈలాగున ఏల చేయు చున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌంద ర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.
7. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని
8. యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.
9. అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారు లగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని
10. ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.
11. అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగాహగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మనయేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.
12. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము.
13. నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.
14. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.
15. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.
16. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
17. నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,
18. ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.
19. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.
20. నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయు లందరును కనిపెట్టియున్నారు.
21. ఇదిగాక నా యేలినవాడ వైన రాజవగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అప రాధులముగా ఎంచబడుదుము.
22. ఆమె రాజుతో మాట లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగాప్రవక్తయగు నాతాను వచ్చి యున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.
23. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి
24. నా యేలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?
25. ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచురాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు.
26. అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహో యాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.
27. నా యేలినవాడ వును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడై యుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.
28. దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.
29. అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగాసకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు
30. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా
31. బత్షెబ సాగిల పడి రాజునకు నమస్కారము చేసినా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.
32. అప్పుడు రాజైన దావీదుయాజకుడైన సాదోకును ప్రవక్త యైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.
33. అంతట రాజుమీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి
34. యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.
35. ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించి యున్నాను గనుక పిమ్మట మీరు యెరూష లేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.
36. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.
37. యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;
38. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా
39. యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరునురాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి
40. మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధిక ముగా సంతోషించిరి.
41. అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా
42. యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయాలోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా
43. యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.
44. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;
45. యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.
46. మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;
47. అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమ స్కారము చేసి యిట్లనెను
48. నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.
49. అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.
50. అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
51. అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా
52. సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనిన యెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి
53. బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితోనీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.
Chapter 2
1. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను
2. లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను; కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి
3. నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;
4. అప్పుడునీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నాయెదుట తమ పూర్ణహృద యముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనిన యెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును.
5. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీ వెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.
6. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు.
7. నేను నీ సహోదరుడైన అబ్షా లోము ముందరనుండి పారిపోగా, గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారిమీద దయయుంచి నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము.
8. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరి వాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగాయెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.
9. వానిని నిర్దోషిగా ఎంచవద్దు; నీవు సుబుద్ధిగలవాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియును; వాని నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము.
10. తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.
11. దావీదు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.
12. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహా సనముమీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను.
13. అంతలో హగ్గీతు కుమారుడైన అదో నీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి
14. నీతో చెప్పవలసిన మాటయొకటి యున్నదనెను. ఆమె అది చెప్పుమనగా
15. అతడు రాజ్యము నాదై యుండె ననియు, నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరు తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు; అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను; అది యెహోవావలన అతనికి ప్రాప్తమాయెను,
16. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసికొనుచున్నాను, కాదనకుము.
17. ఆమెచెప్పుమనగా అతడురాజగు సొలొమోను షూనే మీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదనిచెప్ప డనెను.
18. బత్షెబమంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెద ననెను.
19. బత్షెబ రాజైన సొలొమోనునొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు, రాజులేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లికొరకు ఆసనము ఒకటి వేయింపగా, ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను.
20. ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజునా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా
21. ఆమెషూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింప వలెననెను.
22. అందుకు రాజైన సొలొమోనుషూనే మీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారు డైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.
23. మరియు రాజైన సొలొమోనుయెహోవా తోడు అదోనీయా పలికిన యీ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక.
24. నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి
25. యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.
26. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణ మునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.
27. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండ తీసివేసెను, అందువలన యెహోవా ఏలీ కుటుంబికులను గూర్చి షిలోహులో ప్రమాణముచేసిన మాట నెరవేరెను.
28. యోవాబు అబ్షా లోము పక్షము అవలంబింపక పోయినను అదోనీయాపక్షము అవలంబించి యుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
29. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద నున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించినీవు వెళ్లి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున
30. బెనాయా యెహోవా గుడారమునకు వచ్చిరాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవా బుతో చెప్పెను. అతడు అదికాదు, నేనిక్కడనే చచ్చెద ననగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను.
31. అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము; అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నామట్టుకును నా తండ్రి కుటుంబికులమట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము.
32. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటె నీతిపరులును యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుష్యులమీద పడి యోవాబు నా తండ్రియైన దావీదు ఎరుగకుండ కత్తిచేత వారిని చంపి వేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పించును.
33. మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులు గాని, దావీదునకును అతని సంతతి కిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును.
34. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను.
35. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియ మించెను.
36. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము.
37. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలిసికొనుము, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా
38. షిమీతమరు సెలవిచ్చినది మంచిదేను; నా యేలినవారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసెదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను.
39. అయితే మూడు సంవత్సరము లైన తరు వాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నొద్దకు చేరిరి. అంతటనీవారు గాతులో ఉన్నారనిషిమీకి వర్తమానము కాగా
40. షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను.ఈలాగున షిమీ పోయి గాతులోనుండి తన పని వారిని తీసికొనివచ్చెను.
41. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము కాగా
42. రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్లుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలిసికొన వలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని గదా? మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి;
43. కాబట్టి యెహోవాతోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనక పోతివేమి అని అడిగి
44. నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలి యును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.
45. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును, దావీదు సింహా సనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి
46. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవియ్యగా అతడు బయలుదేరి వానిమీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను.
Chapter 3
1. తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకార మును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.
2. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి.
3. తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను.
4. గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
5. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా
6. సొలొమోను ఈలాగు మనవి చేసెనునీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్య మును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగు పరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహా సనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందుమహాకృపను చూపియున్నావు.
7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
8. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము.
9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.
10. సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక
11. దేవుడు అతనికి ఈలాగు సెల విచ్చెనుదీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించు టకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.
12. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.
13. మరియు నీవు ఐశ్వర్య మును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.
14. మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.
15. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందు చేయించెను.
16. తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.
17. వారిలో ఒకతె యిట్లు మనవి చేసెనునా యేలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితో కూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని.
18. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దర మును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు.
19. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను.
20. కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను.
21. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని.
22. అంతలో రెండవ స్త్రీ అది కాదు;బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమెకాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా
23. రాజుబ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొక తెయు, రెండవదిఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది;
24. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా
25. రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.
26. అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, రాజునొద్దనా యేలిన వాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను.
27. అందుకు రాజుబ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.
28. అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.
Chapter 4
1. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.
2. అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;
3. షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదుకుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;
4. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.
5. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను;
6. అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి.
7. ఇశ్రా యేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.
8. వారి పేళ్లు ఇవే; ఎఫ్రా యిము మన్యమందు హూరు కుమారుడు,
9. మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;
10. అరుబ్బోతులో హెసెదు కుమా రుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.
11. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొ మోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.
12. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దో యును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రె యేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవ తలి స్థలమువరకును వ్యాపించుచున్నది.
13. గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.
14. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
15. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.
16. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
17. ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.
18. బెన్యా మీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.
19. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశ మందు అధికారి.
20. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.
21. నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.
22. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,
23. క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱలును, ఇవియు గాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.
24. యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.
25. సొలొ మోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.
26. సొలొమోను రథ ములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండు వేల గుఱ్ఱములును ఉండెను.
27. మరియు రాజైన సొలొ మోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారు లలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహా రము సంగ్రహముచేయుచు వచ్చెను.
28. మరియు గుఱ్ఱ ములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.
29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివే చనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను
30. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
31. అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తిచుట్టునున్న జనము లన్నిటిలో వ్యాపితమాయెను.
32. అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.
33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.
34. అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు,జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.
Chapter 5
1. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.
2. హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.
3. యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.
4. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయెనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.
5. కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.
6. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక
7. నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి
8. సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
9. నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.
10. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
11. సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
12. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.
13. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
14. వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
15. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.
16. వీరు కాక పనిమీదనున్న సొలొ మోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.
17. రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.
18. ఈలాగున సొలొ మోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.
Chapter 6
1. అయితే ఇశ్రాయేలీయులు ఇగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సర మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.
2. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
3. పరిశుద్ధస్థలము ఎదుట నున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు,మందిరము ముందర అది పది మూరల వెడల్పు.
4. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను.
5. మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మంది రపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.
6. క్రింది అంతస్తుగది అయిదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు, మూడవ అంతస్తుగది యేడు మూరల వెడల్పు; ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండ మందిరపు గోడచుట్టు బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను.
7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.
8. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్యమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.
9. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.
10. మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
11. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
12. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;
13. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
14. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
15. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.
16. మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.
17. అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.
18. మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.
19. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపర చెను.
20. గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననెపొదిగించెను.
21. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను.
22. ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.
23. మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;
24. ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.
25. రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.
26. ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.
27. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.
28. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.
29. మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కిం చెను.
30. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను.
31. గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను.
32. రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.
33. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
34. రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
35. వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
36. మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూల ములతోను కట్టించెను.
37. నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;
38. పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.
Chapter 7
1. సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.
2. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.
3. మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.
4. మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.
5. తలు పులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌక ముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.
6. మరియు అతడు స్తంభ ములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటప మును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను.
7. తరువాత తాను తీర్పుతీర్చ కూర్చుండుటకై యొక అధికార మంటపమును కట్టించెను; దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కఱ్ఱతో కప్పబడెను.
8. లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపమువంటి యొక నగరును కట్టించెను.
9. ఈ కట్టడములన్నియు పునాది మొదలుకొని గోడ చూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణప్రకారముగా తొలవబడినట్టివియు, రంప ములచేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను; ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను.
10. దాని పునాది పదేసి యెనిమిదేసి మూరలుగల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్ట బడెను.
11. పైతట్టున పరిమాణప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు.
12. గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.
13. రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను.
14. ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.
15. ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.
16. మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.
17. మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.
18. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.
19. మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.
20. మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.
21. ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.
22. ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.
23. మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్ర ముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.
24. దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను.
25. అది పండ్రెండు ఎడ్లమీద నిలువబడియుండెను; వీటిలో మూడు ఉత్తరదిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణదిక్కును మూడు తూర్పుదిక్కును చూచుచుండెను. వీటిమీద ఆ సముద్రము ఎత్తబడి యుండెను. వాటి వెనుకటి భాగములన్నియు లోపలితట్టు త్రిప్పబడి యుండెను.
26. అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్ప éములవంటి పని కలిగి యుండెను; అది తొమి్మది గరిసెలు పట్టును.
27. మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను.
28. ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను.
29. జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహ ములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను.
30. మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి యిత్తడి చక్రములు ఇత్తడి యిరుసులును కలిగి యుండెను; దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు; ఈ దిమ్మలు తొట్టిక్రింద అతికిన ప్రతిస్థలము దగ్గర పోత పోయబడెను.
31. మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడు నిడివి; అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి. మరియు ఆ మూతిమీద ప్రక్కలుగల చెక్కిన పనులు గలవు; ఇవి గుండ్రనివిగాక చచ్చౌకముగా ఉండెను.
32. మరియు ప్రక్కపలకల క్రింద నాలుగు చక్రములు కలవు; చక్రముల యిరుసులు స్తంభములతో అతకబడి యుండెను; ఒక్కొక్క చక్రము మూరెడునర నిడివి గలదై యుండెను.
33. ఈ చక్రముల పని రథ చక్రముల పనివలె ఉండెను, వాటి యిరుసులును అడ్డలును పూటీలును ఆకులును పోతపనివై యుండెను.
34. ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు; ఈ దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను.
35. మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి యుండెను; మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏకాండముగా ఉండెను.
36. దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.
37. ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణ మును రూపమును ఏకరీతిగా ఉండెను.
38. తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.
39. మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభ ములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను;సముద్రమును దక్షిణమునకు ఎదు రుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను.
40. మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను.
41. రెండు స్తంభములను, ఆ రెండు స్తంభముల మీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పై పీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను,
42. ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,
43. పది స్తంభ ములను, స్తంభములమీద పది తొట్లను,
44. ఒక సముద్ర మును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,
45. బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.
46. యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతాను నకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
47. అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
48. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,
49. గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయి దును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను,
50. మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరి శుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్ని టిని చేయించెను,
51. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్త మాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.
Chapter 8
1. అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రా యేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రా యేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.
2. కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొ మోను నొద్దకు కూడుకొనిరి.
3. ఇశ్రాయేలీయుల పెద్ద లందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎతి ్త
4. దాని తీసికొనివచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకు లును లేవీయులును తీసికొనిరాగా
5. రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱలను ఎడ్లను బలిగా అర్పించిరి.
6. మరియు యాజకులు యెహోవానిబంధన మందస మును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో,కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.
7. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను.
8. వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడ వుగా ఆ దండెలుంచబడెను గాని యివి బయటికి కనబడ లేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి.
9. ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
10. యాజకులు పరిశుద్ధస్థల ములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.
11. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.
12. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
13. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి యున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి
14. ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమా జకులందరిని ఈలాగు దీవించెను.
15. నా తండ్రియైన దావీదు నకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక.
16. నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములో నైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెల విచ్చెను.
17. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవ లెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా
18. యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగానా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి యున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;
19. అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్ట బోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును.
20. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా సెలవుచొప్పున ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడనై యుండి, ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిర మును కట్టించియున్నాను.
21. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తుదేశ ములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది.
22. ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను
23. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై యున్నావు,
24. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి యున్నావు.
25. యెహోవా ఇశ్రాయేలీయుల దేవానీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచి నట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము.
26. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము.
27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
28. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.
29. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లునా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.
30. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్న పము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.
31. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతనిచేత ప్రమాణము చేయించు టకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టు నప్పుడు
32. నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.
33. మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల
34. నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయు లగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.
35. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగున శ్రమపెట్టుటవలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసిన యెడల
36. నీవు ఆకాశమందు విని, నీ దాసులైన ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము.
37. దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువువారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను,
38. ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల
39. ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి
40. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయ భక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రు లందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.
41. మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశ మునుండి వచ్చి
42. నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల
43. ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొనుదాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రా యేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసికొందురు.
44. మరియు నీ జనులు తమ శత్రువు లతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరునప్పుడు, నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మంది రముతట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన యెడల
45. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారి కార్యమును నిర్వహించుము.
46. పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరయైనట్టి గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు
47. వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొనిమేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల
48. తమ్మును చెరగా కొని పోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసిన యెడల
49. ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి
50. నీకు విరోధముగా పాపముచేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.
51. వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు.
52. కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేయు విన్నపముమీదను, దృష్టియుంచి,వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపముల నాలకించుము.
53. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా.
54. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశముతట్టు తన చేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్లూనుట మాని, లేచి నిలిచిన తరువాత
55. అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను.
56. ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు
57. కాబట్టి మన దేవుడైన యెహోవా మనల ను వదలకను విడువకను, మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి
58. తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పిత రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.
59. ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక.
60. అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.
61. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయ ములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.
62. అంతట రాజును, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా
63. ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయు లందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.
64. ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవర ణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.
65. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
66. ఎనిమిదవ దినమున అతడు జను లకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జను లకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లి పోయిరి.
Chapter 9
1. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును... కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత
2. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై
3. అతనితో ఈలాగు సెలవిచ్చెనునా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.
4. నీ తండ్రి యైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృద యుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అను సరించిన యెడల
5. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.
6. అయితే మీరేగాని మీ కుమారులే గాని యేమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజిం చినయెడల
7. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశ ములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
8. ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
9. జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
10. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికివచ్చియున్నందున
11. సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.
12. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
13. నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్1 అని పేరు.
14. హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.
15. యహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.
16. ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.
17. సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్ హోరోనును,
18. బయతాతును అరణ్యములోనున్న తద్మోరు నును,
19. సొలొమోను భోజనపదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతు లకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను.
20. అయితే ఇశ్రాయేలీయులుకాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.
21. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వముచేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.
22. అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.
23. సొలొమోను యొక్క పనిమీదనున్న ప్రధానులు ఐదువందల ఏబదిమంది; వీరు పనివాండ్లమీద అధికారులుగా ఉండిరి.
24. ఫరో కుమార్తె దావీదు పురమునుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను.
25. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠముమీద ఏడాదిలో మూడు మారులు దహనబలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖ మందున్న పీఠముమీద ధూపద్రవ్యము వేయుచుండెను; పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను.
26. మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
27. సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.
28. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
Chapter 10
1. షేబదేశపురాణి యెహోవా నామమును... గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
2. ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా
3. ఆమె వేసిన ప్రశ్నలన్ని టికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను.
4. షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,
5. అతని బల్లమీదనున్న భోజనద్రవ్య ములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై
6. రాజుతో ఇట్లనెనునీ కార్యములనుగూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే;
7. అయి నను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్ప బడలేదని యిప్పుడు నేను తెలిసి కొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించి యున్నవి;
8. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పు డును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు
9. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రా యేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.
10. మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగార మును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.
11. మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
12. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
13. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశ మునకు తిరిగి వెళ్లిరి.
14. ఏటేట సొలొమోనునకువచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు.
15. ఇదియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకులయొద్దనుండియు అరబి రాజులయొద్ద నుండియు దేశాధికారుల యొద్ద నుండియు అతనికి చాలా వచ్చుచుండెను.
16. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.
17. మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
18. మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను.
19. ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్యముల యందు ఊతలుండెను; ఊతలదగ్గర రెండు సింహములు నిలిచియుండెను.
20. ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.
21. మరియు రాజైన సొలొ మోను పానపాత్రలు బంగారపువై యుండెను; లెబానోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది యొకటియు లేదు; సొలొమోను దినములలో వెండి యెన్నికకు రాలేదు.
22. సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
23. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై యుండెను.
24. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.
25. ఏర్పాటైన ప్రతిమనిషి వెండివస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.
26. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను; అతడు వెయ్యిన్ని నాలుగువందల రథములును పండ్రెండువేల రౌతులును గలవాడై యుండెను; వీటిని అతడు రథములకై యేర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను.
27. రాజు యెరూషలేములో వెండినిరాళ్లంత విస్తారముగా వాడుక చేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింప జేసెను.
28. సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి.
29. వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజు లందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.
Chapter 11
1. మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు... సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
2. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
3. అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.
4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృద యము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
5. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.
7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.
8. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
9. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై
10. నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి
11. సెలవిచ్చినదేమనగానేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.
12. అయి నను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందునేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను.
13. రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.
14. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
15. దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.
16. ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
17. అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను.
18. వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.
19. హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను.
20. ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.
21. అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు వినినేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా
22. ఫరోనీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయొద్ద నీకేమి తక్కువైనది అని యడిగెను. అందుకు హదదుతక్కువైన దేదియు లేదు గాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.
23. మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.
24. దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్య మునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.
25. హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.
26. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.
27. ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను.
28. అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా ¸°వనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.
29. అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయు డును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.
30. అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెనుఈ పది తునకలను నీవు తీసికొనుము;
31. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాజనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మో నీయుల దేవతకును మ్రొక్కి,
32. సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను.
33. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్ర ములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.
34. రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచ రించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినము లన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.
35. అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;
36. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
37. నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.
38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచి నట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్ప గించెదను.
39. వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదుసంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.
40. జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను.
41. సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
42. సొలొమోను యెరూష లేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.
43. అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.
Chapter 12
1. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను.
2. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను.
3. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.
4. నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.
5. అందుకు రాజుమీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి.
6. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసిఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడు గగా
7. వారుఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.
8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸°వనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను
9. మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?
10. అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ ¸°వనస్థులు ఈ ఆలోచన చెప్పిరినీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్మునా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.
11. నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
12. మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి.
13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸°వనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను
14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
15. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.
16. కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిదావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.
17. అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.
18. తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.
19. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.
20. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
21. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రా యేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను.
22. అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
23. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము
24. యెహోవా సెలవిచ్చునదేమనగాజరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహో దరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.
25. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను.
26. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని
27. యరొ బాము తన హృదయమందు తలంచి
28. ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
29. ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
30. దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
31. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను.
32. మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.
33. ఈ ప్రకా రము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలి పీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రా యేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను.
Chapter 13
1. అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా
2. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రక టనచేసెనుబలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగాదావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
3. ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.
4. బేతేలునందున్న బలి పీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను.
5. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.
6. అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మును పటివలె ఆయెను.
7. అప్పుడు రాజునీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా
8. దైవజనుడు రాజుతో ఇట్లనెనునీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను;
9. అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను.
10. అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను.
11. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపుర ముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియ జెప్పగా
12. వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను; అంతట అతని కుమారులు యూదాదేశ ములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి.
13. పిమ్మట అతడు తన కుమారులను పిలిచినాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి
14. మస్తకివృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచియూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడవు నీవేనా? అని అడుగగా అతడునేనే అనెను.
15. అప్పుడు అతడునా యింటికి వచ్చి భోజనము చేయుమనగా
16. అతడునేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను
17. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని చెప్పెను.
18. అందుకతడునేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడుయెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా
19. అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.
20. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.
21. అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచియెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడునీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞా పించినదానిని గైకొనక
22. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.
23. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను.
24. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి యుండెను, సింహమును శవముదగ్గర నిలిచి యుండెను.
25. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండు టయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి.
26. మార్గములోనుండి అతని తోడు కొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడుయెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించి యున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి
27. తన కుమారులను పిలిచిగాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు
28. అతడు పోయి అతని శవము మార్గమందు పడి యుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి
29. దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను.
30. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.
31. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టినేను మరణ మైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతి పెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి,
32. యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములో నున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్య ముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.
33. ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గ మును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.
34. యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.
Chapter 14
1. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా... కాయిలాపడగా
2. యరొబాము తన భార్యతో ఇట్లనెనునీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.
3. కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డితేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా
4. యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను.
5. అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగాయరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచా రించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతెయైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను.
6. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెనుయరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసి కొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.
7. నీవు వెళ్లి యరొబాముతో చెప్ప వలసినదేమనగాఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడునేను నిన్ను జను లలోనుండి తీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి
8. దావీదు సంతతి వారియొద్దనుండి రాజ్యమును తీసి నీకిచ్చి యుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక
9. నీ కంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసి యున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి యున్నావు.
10. కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి,పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.
11. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చి యున్నాడు.
12. కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును;
13. అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.
14. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింప బోవు చున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.
15. ఇశ్రాయేలువారు దేవతాస్తంభ ములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.
16. మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.
17. అప్పుడు యరొ బాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను.
18. జనులు అతనిని సమా ధిలోపెట్టి, యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయాద్వారా సెలవిచ్చిన ప్రకారముగ ఇశ్రాయేలువారందరును అతనికొరకు అంగ లార్చిరి.
19. యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
20. యరొబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు; అతడు తన పితరులతో కూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను.
21. యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహ బాము ఏలుచుండెను. రెహబాము నలువదియొక సంవత్సర ములవాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమను పట్టణమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను; అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.
22. యూదావారు యెహోవా దృష్టికి కీడుచేసి తమ పితరులు చేసినదానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి.
23. ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి.
24. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదా వారును చేయుచు వచ్చిరి.
25. రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తురాజైన షీషకు యెరూష లేము మీదికి వచ్చి
26. యెహోవా మందిరపు ఖజనాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజనాలోని పదార్థములను, ఎత్తికొని పోయెను, అతడు సమస్తమును ఎత్తికొని పోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను.
27. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వార పాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.
28. రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి.
29. రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
30. వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
31. రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మో నీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.
Chapter 15
1. నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలు... బడిలో పదునెనిమిదవ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను.
2. అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.
3. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.
4. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను గనుక
5. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.
6. రెహబాము1 బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
7. అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.
8. అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
9. ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.
10. అతడు నలువదియొక సంవత్సరములుయెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వపేరు1 మయకా, యీమె అబీషాలోము కుమార్తె.
11. ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని
12. పురుషగాములను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడ గొట్టెను.
13. మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.
14. ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.
15. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను.
16. వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.
17. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను.
18. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా
19. నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి యుండవలెను గనుక వెండి బంగార ములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రా యేలు రాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను.
20. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను.
21. అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.
22. అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.
23. ఆసా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగముపుట్టెను.
24. అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.
25. యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సర ములు ఏలెను.
26. అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.
27. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.
28. రాజైన ఆసాయేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
29. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారి నందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవు నిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెల విచ్చిన ప్రకారముగా ఇది జరిగెను.
30. తాను చేసిన పాప ములచేత ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను.
31. నాదాబు చేసిన ఇతర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
32. వారి దినములన్నిటను ఆసా కును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగు చుండెను.
33. యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.
34. ఇతడు యెహోవా దృష్టికి కీడుచేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను.
Chapter 16
1. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన...యెహూకు ప్రత్యక్షమై బయెషానుగూర్చి యీలాగు సెల విచ్చెను
2. నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాప ములచేత నాకు కోపము పుట్టించి యున్నావు.
3. కాబట్టి బయెషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసముచేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతివారికి నేను చేసినట్లు నీ సంతతివారికిని చేయబోవు చున్నాను.
4. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.
5. బయెషా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు, అతని బలమును గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.
6. బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.
7. మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనే యుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టిం చిన దాని నంతటిని బట్టియు, అతడు తన రాజును చంపుటను బట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.
8. యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సర ములు ఏలెను.
9. తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి
10. అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభ వించెను.
11. అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.
12. బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపముచేసి, ఇశ్రా యేలువారు పాపము చేయుటకు కారకులై, తాము పెట్టుకొనిన దేవతలచేత ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక
13. వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమీ బయెషా సంతతివారినందరిని నాశనముచేసెను.
14. ఏలా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
15. యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా
16. జిమీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి.
17. వంటనే ఒమీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి.
18. పట్టణము పట్టుబడెనని జిమీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.
19. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.
20. జిమీచేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.
21. అప్పుడు ఇశ్రాయేలువారు రెండు జట్లుగా విడి పోయి, జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగముమంది ఒమీ పక్షమునను చేరిరి.
22. ఒమీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపువారిని జయింపగా తిబ్నీ చంపబడెను; ఒమీ రాజాయెను.
23. యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.
24. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణ మొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను1 అను పేరు పెట్టెను.
25. ఒమీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరికంటె మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.
26. అతడు నెబాతు కుమారు డైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని, ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో, దానిని అనుసరించి ప్రవర్తించెను.
27. ఒమీ చేసిన యితర కార్యములను గూర్చియు అతడు అగుపరచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
28. ఒమీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను.
29. యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రా యేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరు వదిరెండు సంవత్సరములు ఏలెను.
30. ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
31. నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
32. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
33. మరియు అహాబు దేవతాస్తంభమొకటి1 నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజు లందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
34. అతని దిన ములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.
Chapter 17
1. అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చిఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.
2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
3. నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
5. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
6. అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
7. కొంతకాలమైనతరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
8. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;
9. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
10. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
11. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
12. అందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
13. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
14. భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
15. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.
16. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
17. అటుతరువాత ఆ యింటి యజ మానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.
18. ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
19. అతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి
20. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి
21. ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా
22. యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
23. ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి--ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
24. ఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.
Chapter 18
1. అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు... యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమైనేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా,
2. అహాబును దర్శించు టకై ఏలీయా వెళ్లిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా
3. అహాబు తన గృహనిర్వాహ కుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయ భక్తులుగలవాడై
4. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.
5. అహాబుదేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.
6. కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరియొక పాలు తీసికొని, అహాబు ఒంట రిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లిరి.
7. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా
8. అతడునేనేయని చెప్పినీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడనితెలియజేయుమనెను.
9. అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?
10. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.
11. నీవునీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;
12. అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు
13. నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.
14. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్న పానములిచ్చి వారిని పోషించితిని.
15. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగానీ యేలినవాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవిచేయగా
16. ఏలీయాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్త మానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను.
17. అహాబు ఏలీయాను చూచిఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా
18. అతడునేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.
19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.
20. అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి,ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను.
21. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.
22. అప్పుడు ఏలీయాయెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి యున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు.
23. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును.
24. తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.
25. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచిమీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడు; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా
26. వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకుబయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్దగంతులువేయ మొదలుపెట్టిరి.
27. మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా
28. వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి.
29. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను.
30. అప్పుడు ఏలీయానా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి,
31. యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని
32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి
33. కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగామీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను
34. అదియైన తరువాతరెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు
35. ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను.
36. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.
37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
38. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
39. అంతట జనులందరును దాని చూచి సాగిలపడియెహోవాయే దేవుడు,యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
40. అప్పుడు ఏలీయాఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.
41. పిమ్మట ఏలీయావిస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
42. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
43. తరువాత అతడు తన దాసుని పిలిచినీవు పైకిపోయి సము ద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడుఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.
44. ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయానీవు అహాబు దగ్గరకు పోయినీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధ పరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
45. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రె యేలునకు వెళ్లిపోయెను.
46. యెహోవా హస్తము ఏలీయానుబలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను.
Chapter 19
1. ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తల... నందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
2. యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెనురేపు ఈ వేళకు నేను నీ ప్రాణ మును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.
3. కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడు కొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి
4. తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడైయెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.
5. అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టినీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.
6. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను.
7. అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టినీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు
8. అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి
9. అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమైఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా
10. అతడుఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.
11. అందుకాయననీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
12. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.
13. ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.
14. అందుకతడుఇశ్రా యేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్య ములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచు చున్నారని చెప్పెను.
15. అప్పుడు యెహోవా అతనికి సెల విచ్చిన దేమనగానీవు మరలి అరణ్యమార్గమున దమస్కు నకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;
16. ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
17. హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.
18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.
19. ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా
20. అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తినేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడుపోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.
21. అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డిం చెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
Chapter 20
1. తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను.
2. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు దూతలను పంపి
3. నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.
4. అందుకు ఇశ్రాయేలు రాజునా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవుప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామనిప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా
5. ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చిబెన్హదదు ఇట్లు సెల విచ్చుచున్నాడని తెలియజెప్పిరినీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింప వలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను.
6. రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధిం చుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొని పోవుదురు.
7. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువ నంపించిబెన్హదదునీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయ గోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.
8. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,
9. గనుక అతడుమీరు రాజైన నా యేలిన వానితో తెలియజెప్పవలసినదేమనగానీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా
10. బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.
11. అందుకు ఇశ్రాయేలురాజుతన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.
12. బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరి గించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధ పడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా
13. ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చునదేమనగాఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.
14. ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడురాజ్యాధిపతులలో ఉన్న ¸°వనులచేత జరుగునని యెహోవా సెల విచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడునీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.
15. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మందియైరి.
16. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులై యుండిరి.
17. రాజ్యాధిపతులలోనున్న ఆ ¸°వనులు ముందుగా బయలు దేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా
18. అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను.
19. రాజ్యాధిపతులలోనున్న ఆ ¸°వనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి
20. ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను.
21. అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.
22. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చినీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాదినాటికి సిరియారాజు నీమీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను.
23. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరివారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము.
24. ఇందుకు మీరు చేయవలసిన దేమనగా, ఆ రాజులలో ఒక్కొకని వాని వాని ఆధిపత్యములోనుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి
25. నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుఱ్ఱములకు గుఱ్ఱములను రథములకు రథములను లెక్కించి పోగు చేయుము; అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసినయెడల అవశ్యముగా మనము వారిని గెలు చుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను.
26. కాబట్టి మరుసంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరి పోయి ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను.
27. ఇశ్రాయేలు వారందరును పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రా యేలువారు మేకపిల్లల మందలు రెంటివలె వారియెదుట దిగియుండిరి గాని దేశము సిరియనులచేత కప్పబడి యుండెను.
28. అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇశ్రా యేలు రాజుతో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చున దేమనగాసిరియనులు యెహోవాకొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు; అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను.
29. వారు ఎదురుముఖములుగా ఏడుదినములు గుడారములు వేసికొని యుండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలువారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్షమందిని హతము చేసిరి.
30. తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొకప్రాకారము శేషించినవారిలో ఇరువది యేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా
31. అతని సేవకులుఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేమువింటిమి గనుక నీకు అనుకూలమైనయెడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలు రాజునొద్దకు పోవుదుము; అతడు నీ ప్రాణమును రక్షించు నేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను.
32. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసి కొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చినీ దాసుడైన బెన్హదదుదయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడుబెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.
33. అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగున నున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టిబెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడుమీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.
34. అంతట బెన్హదదుతమ తండ్రి చేతిలోనుండి నా తండ్రి తీసికొనిన పట్టణములను నేను మరల అప్పగించెదను; మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమకొరకు తమరు వీధులను కట్టించు కొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబుఈ ప్రకారముగా నీతో సంధిచేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధిచేసి అతని పోనిచ్చెను.
35. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితోనన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు
36. అతడునీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను.
37. తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడునన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయ పరచెను.
38. అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని యుండి
39. రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెనునీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధము గానైనను వాడు తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.
40. అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రా యేలురాజునీకు నీవే తీర్పు తీర్బుకొంటివి గనుక నీవుచెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా
41. అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను.
42. అప్పుడు అతడుయెహోవా సెలవిచ్చునదేమనగానేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింప బడుదురని రాజుతో అనగా
43. ఇశ్రాయేలురాజు మూతి ముడుచు కొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను.
Chapter 21
1. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా
2. అహాబు నాబోతును పిలిపించినీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.
3. అందుకు నాబోతునా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా
4. నా పిత్రార్జితమును నీ కియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.
5. అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చినీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా
6. అతడు ఆమెతో ఇట్లనెనునీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీ కిచ్చెదనని, యెజ్రె యేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడునా ద్రాక్షతోట నీ కియ్యననెను.
7. అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
8. అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను.
9. ఆ తాకీదులో వ్రాయించిన దేమనగాఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి
10. నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్టుడి.
11. అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి.
12. ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి.
13. అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
14. నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజె బెలునకు వర్తమానము పంపగా
15. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయెనని యెజెబెలు వినినాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రె యేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను.
16. నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను.
17. అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
18. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదు ర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను.
19. నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగాదీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగాఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
20. అంతట అహాబు ఏలీయాను చూచినా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెనుయెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.
21. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనునేను నీ మీదికి అపా యము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.
22. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
23. మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగాయెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
24. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను
25. తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.
26. ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను.
27. అహాబు ఆ మాటలు విని తన వస్త్ర ములను చింపు కొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా
28. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
29. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.
Chapter 22
1. సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సర ములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.
2. మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా
3. ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించిరామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి
4. యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతునేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను.
5. పిమ్మట యెహోషాపాతునేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా
6. ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక
7. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.
8. అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషా పాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను.
9. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచిఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.
10. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా
11. కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చివీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చు చున్నాడని చెప్పెను.
12. ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచుయెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.
13. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా
14. మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను.
15. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజుమీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడుయెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్ప గించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.
16. అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా
17. అతడుఇశ్రాయేలీయు లందరును కాపరిలేని గొఱ్ఱలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను.
18. అప్పుడు ఇశ్రా యేలురాజు యెహోషాపాతును చూచిఇతడు నన్ను గూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా
19. మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని
20. అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.
21. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
22. అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
23. యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
24. మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.
25. అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను.
26. అప్పుడు ఇశ్రాయేలు రాజుమీకాయాను పట్టుకొని తీసికొని పోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి
27. బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.
28. అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.
29. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషా పాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా
30. ఇశ్రా యేలురాజునేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవే శించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను.
31. సరియారాజు తన రథ ములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలి పించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా
32. రథాధిపతులు యెహోషాపాతును చూచియితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా
33. రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి.
34. పమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.
35. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను.
36. సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చు నని ప్రచురమాయెను.
37. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను.
38. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
39. అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
40. అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
41. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.
42. యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను.
43. అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.
44. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధిచేసెను.
45. యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్థముచేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
46. తన తండ్రియైన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.
47. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.
48. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.
49. అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషా పాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.
50. పమ్మట యెహోషా పాతు తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్ట బడెను; అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను.
51. అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవ త్సరములు ఇశ్రాయేలును ఏలెను.
52. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి,తన తలిదండ్రు లిద్దరి ప్రవర్త నను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.
53. అతడు బయలు దేవతను పూజిం చుచు, వానికి నమస్కారము చేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

Post a Comment