The Holy Bible - 1 థెస్సలొనీకయులకు (1 Thessalonians)

1 థెస్సలొనీకయులకు (1 Thessalonians)

Chapter 1

1. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
2. విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,
3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తు తులు చెల్లించుచున్నాము.
4. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.
5. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.
6. పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.
7. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;
8. అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
9. మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసు లగుటకును,
10. దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

Chapter 2

1. సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని
2. మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.
3. ఏల యనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని
4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.
6. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్త లులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను,మీవలననే గాని యితరుల వలననే గాని, మను ష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.
7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి.
8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.
9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీ
10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి
11. తన రాజ్యమునకును మహిమ కును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చ రించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,
12. తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
13. ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
14. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశ
15. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయు టకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,
16. అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట
17. సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.
18. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.
19. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.
20. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనంద మునై యున్నారు.

Chapter 3

1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని యెంచి,
2. యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
3. మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;
4. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.
5. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.
6. తిమోతియు ఇప్పుడు మీ యొద్దనుండి మాయొద్దకు వచ్చి,మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.
7. అందుచేత సహోదరు లారా, మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు.
8. ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.
9. మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
10. మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?
11. మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.
12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,
13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభి వృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

Chapter 4

1. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.
2. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చ రించుచున్నాము.
3. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
4. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,
5. పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
6. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.
7. పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.
8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
9. సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.
10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహో దరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభి వృద్ధినొందుచుండవలెననియు,
11. సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞా పించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,
12. మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమి్మనయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.
16. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
18. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

Chapter 5

1. సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమ యములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.
2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.
5. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.
6. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
7. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
8. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
10. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.
11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి
13. వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.
14. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
16. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
17. యెడతెగక ప్రార్థనచేయుడి;
18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
19. ఆత్మను ఆర్పకుడి.
20. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
22. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
24. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
25. సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
26. పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
27. సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
28. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Grace Of God - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger